తెలంగాణ ప్రభుత్వ సంస్థ
మోసపూరిత కాల్స్ పట్ల జాగ్రత్త. HMWSSB అధికారులు ఫోన్ కాల్స్‌లో ఎప్పుడూ OTP, బ్యాంకు వివరాలు లేదా చెల్లింపులు అడగరు. ఫిర్యాదుల కోసం మా 24×7 హెల్ప్‌లైన్ 155313కు కాల్ చేయండి.

వాటర్ బిల్ అప్‌డేట్ పేరుతో వచ్చే అనుమానాస్పద సందేశాలపై అప్రమత్తంగా ఉండాలి: జలమండలి

06 Oct 2026

 

# మీడియాలో వచ్చిన సైబర్ మోసాల కథనాల నేపథ్యంలో వినియోగదారులకు సూచనలు
# గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులు, APK ఫైల్స్‌ను తెరవొద్దు
# ఓటీపీ, పిన్, సీవీవీ, బ్యాంకు ఖాతా లేదా కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు
# అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకు, సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించాలి

వాటర్ బిల్ అప్‌డేట్, బిల్లు బకాయి, కనెక్షన్ తొలగింపు తదితర పేర్లతో వినియోగదారులను సంప్రదించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఘటనలకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో జలమండలి వినియోగదారులకు పలు సూచనలు చేసింది.

గుర్తుతెలియని వ్యక్తులు జలమండలి పేరు లేదా వాటర్ బిల్ అప్‌డేట్ పేరుతో ఫోన్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ , వాట్సాప్ సందేశాలు పంపి, లింకులు లేదా ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయాలని కోరితే స్పందించవద్దని సూచించింది. అలాగే మొబైల్‌లో ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేయాలని, స్క్రీన్ షేరింగ్ లేదా రిమోట్ యాక్సెస్ ఇవ్వాలని కోరినా అనుమతించవద్దని తెలిపింది.

ఇటువంటి సందర్భాల్లో ఓటీపీ, యూపీఐ పిన్ నంబర్, డెబిట్/క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ, పాస్ వర్డ్ వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు వెల్లడించరాదని జలమండలి స్పష్టం చేసింది. నీటి బిల్లుల చెల్లింపు, బిల్లు వివరాల పరిశీలనకు జలమండలి అధికారికంగా అందుబాటులో ఉంచిన మార్గాలను మాత్రమే వినియోగించాలని సూచించింది.

ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు గుర్తించిన వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి ఖాతా/కార్డుకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది. అనంతరం సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసి, సంబంధిత ఎస్ఎమ్ఎస్ లు, ఫోన్ నంబర్లు, లింకులు, లావాదేవీ వివరాలు వంటి ఆధారాలను భద్రపరచుకోవాలని పేర్కొంది.

ఇలాంటి ఘటనలపై సంబంధిత దర్యాప్తు సంస్థలు విచారణ చేపడతాయని, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపింది. వాటర్ బిల్ పేరుతో వచ్చే ప్రతి సందేశాన్ని అధికారికమైనదిగా భావించకుండా, దాని ప్రామాణికతను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని జలమండలి వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.

జలమండలి విజ్ఞప్తి:
అనుమానాస్పద లింక్‌ను క్లిక్ చేయొద్దనీ.. ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చెయ్యవద్దని.. ఓటీపీ.. పిన్.. సీవీవీ చెప్పకూడదని.. అలాగే వాటర్ బిల్‌కు సంబంధించిన ఎస్ఎమ్ఎస్/ మెసేజ్ లు, అనుమానంగా ఉంటే ముందుగా అధికారిక మార్గాల ద్వారా ధృవీకరించుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది.